విభూతిని ఎందుకు పెట్టుకొంటాము?
7. విభూతిని ఎందుకు పెట్టుకొంటాము?
నెయ్యి మరియు ఇతర వనమూలికలతో కలిపి ప్రత్యేకమైన సమిధలతో భగవంతునికి హోమంలో ఆహూతిగా సమర్పించినపుడు అందులోనుంచి వచ్చిన భస్మమే విభూతి. లేదా విగ్రహానికి భస్మముతో అభిషేకము చేసిన దానిని విభూతిగా పరిగణిస్తారు. అంతే కానీ కాలిన ప్రతి వస్తువు యొక్క బూడిద విభూతిగా పరిగనించబడదు.
విభూతిని సాధారణంగా నుదిటి మీద పెట్టుకొంటారు. కొందరు దానిని భుజాలు చాతీ మొదలైన ఇతర శరీర భాగాల మీద కూడా పెట్టుకుంటారు. కొందరు, ఆస్తికులు శరీరానికి అంతటికీ దీనిని రుద్దుకొంటారు. చాలా మంది భస్మాన్ని స్వీకరించినప్పుడల్లా చిటికెడు నోట్లో వేసికొంటారు.
విభూతిని ఎందుకు ధరించాలి?
భస్మము అనే మాటకు "మన పాపాలను భస్మము చేసేది, భగవంతుడిని జ్ఞాపకము చేసేది" అని అర్ధము. "భ" అంటే భస్మము చేయడాన్ని; "స్మ" స్మరణమును సూచిస్తున్నాయి. అందువలన భస్మధారణ దుష్టత్వాన్ని నిర్మూలించి, దివ్యత్వాన్ని జ్ఞాపకం చేస్తుంది. భస్మము .. ధరించిన వారికి శోభనిస్తుంది గనుక "విభూతి" (శోభ) అనీ, దానిని పెట్టుకున్న వారిని పరిశుద్ద పరచి వారిని అనారోగ్యత, దుష్టతలనుండీ రక్షిస్తుంది గనుక రక్ష అని అంటాము.
హోమము (పవిత్రమైన మంత్రాలతో అగ్ని దేవుడికి సమర్పించే నివేదన) అహంకారము స్వార్ధ కామనలను జ్ఞానమనే అగ్నికి లేదా ఒక ఉన్నత నిస్స్వార్ధ కారణార్ధముకు ఆహుతిగా సమర్పించడానిని సూచిస్తుంది. తద్వారా వచ్చే భస్మము అటువంటి పనులు ఫలితంగా వచ్చే మానసిక పరిశుద్దతను సూచిస్తుంది. నివేదనలను, సమిధలను అగ్నిలో దహింపజేయడమనేది జ్ఞానమనే అగ్నిలో అజ్ఞానము, సోమరి తనాన్ని వదిలించు కోవడాన్ని సూచిస్తుంది. మనము ధరించే భస్మము, ఈ శరీరములో నున్న అసత్యపు తాదాత్మ్యత మరియు జనన మరణాల పరిమితుల నుంచి విడివడి స్వతంత్రుల మవ్వాలని సూచిస్తుంది. శరీరము నశించేదని, ఒకనాడది బూడిదగా అవుతుందని కూడా మనకు భస్మ ధారణ గుర్తు చేస్తుంది. అందువలన మనము దేహముపై మితిమీరిన మమకారం కలిగి ఉండకూడదు. మరణమనేది ఏ క్షణానైనా రావచ్చు. ఈ గ్రహింపు జీవితాన్ని ఉత్తమోత్తమముగా వినియోగించుకొని అభివృద్ధి మార్గాన పయనించే లాగున చేస్తుంది. అంతేకాని మరణాన్ని గురించి జ్ఞాపకము చేసే దుఃఖ భరితమైనదని అపార్ధము చేసికో కూడదు. కాలము ఎవరి కోసం నిలబడదని తెలియజేసే శక్తివంతమైన సూచిక ఈ భస్మము.
శరీరమంతటా భస్మాన్ని రాసుకోనేటటువంటి పరమ శివునితో ఈ భస్మము ప్రత్యేకమైన సంబంధము కలిగి ఉంది. శివ భక్తులు భస్మాన్ని త్రిపుండ్రాకారంలో ధరిస్తారు. మధ్యలో ఎర్రని బొట్టుతో కలిపి పెట్టుకున్నప్పుడు ఆ గుర్తు శివ శక్తులను సూచిస్తుంది.
కట్టెలన్నీ(పదార్ధాలు) కాలిపోయిన తరువాత మిగిలేది బూడిద. దానికి నాశనము లేదు. అదే విధముగా లెక్కలేనన్ని నామ రూపాలతో కూడిన సృష్టి అంతా నశించినప్పుడు మిగిలి ఉండేది, నాశనము లేనటువంటి శాశ్వత సత్యము ఐన భగవంతుడు మాత్రమె.
"భస్మము" ఔషధగుణాలని కలిగి ఉంది. ఇది ఎన్నో ఆయుర్వేద మందులలో వాడ బడుతుంది. ఇది శరీరములోని అధిక శీతలతను పీల్చుకొంటుంది. జలుబు, తలనొప్పులు రాకుండా కాపాడుతుంది . భస్మాన్ని నుదుట ధరించేటప్పుడు మృత్యుంజయ మంత్రము చెప్పాలని ఉపనిషత్తులు చెపుతున్నాయి
త్ర్యంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం
ఉర్వారుక మివ బంధనాత్ మ్రుత్యోర్ముక్షీయ మామృతాత్
మనల్ని పోషించేటటువంటి, మన జీవితాలలో పరిమళాలను వ్యాపింప చేసేటటువంటి త్రినేత్రధారుడైన శివుడిని పూజిద్దాము. అతడు మనల్ని దుఃఖము మరియు మరణాల సంకెళ్ళనుండి పండిన దోసకాయ తోడిమ నుండి విడిపోయే టంత సులభంగా విడిపించును గాక.
(తరువాతి శీర్షిక .. ఆహారము తీసికొనే ముందర భగవంతునికి నివేదిస్తాము ఎందుకు?)
SAINADH REDDY
A to Z Info.org website dedicated to Young Indians. This website mainly focus on Education, Jobs, Tricks, Tips, Latest Technology Updates, Software's, Biographies of Eminent Personalities, Entertainment, Film News, Tutorials and many more. Please comment below how to improve our services
0 comments:
Post a Comment